బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హైఅలర్ట్‌గా ఉండాలని అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సమీక్షలో భాగంగా తుపాను ప్రస్తుత పరిస్థితి దాని తీవ్రత తీరం దాటే అవకాశాలపై అధికారులు హోంమంత్రికి వివరించారు. మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే అధికారుల సమష్టి కృషితో రెండు తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అదే సమన్వయంతో అక్వాన్ తుపానును కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.

కోస్తాంధ్రలో భారీ వర్షాలు బలమైన ఈదురుగాలులు

తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీరప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

రైతులకు ముందస్తు జాగ్రత్తలపై సూచనలు

తుపాను నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి సూచించారు. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలను కాపాడుకునేలా రైతులకు అవసరమైన సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు.

తీరప్రాంత జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *