D Spiritual: Nov 17: భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మదినోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించిన ఐదు ‘ప్రేమ ప్రవాహిని’ రథాలు ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకున్నాయి. గత 18 నెలలుగా దేశంలోని దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో సుమారు లక్ష కిలోమీటర్లు ప్రయాణించిన ఈ రథాలు ఆసేతు హిమాచలం పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని ఉరవకొండకు చేరుకోవడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా తాను షిరిడీ సాయి అవతారమని ప్రకటించిన పుణ్యక్షేత్రంగా ఉరవకొండకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఐదు రథాలతో పాటు, 1940 అక్టోబరు 20న స్వామివారు ‘మానస భజరే గురు చరణం’ భజన ఆలపించిన అబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు తోటలోని రాతిశిలపై నిర్మించిన బాలసాయి శిలా మందిరం వద్ద వెలిగించిన జ్యోతిని కలిగిన ప్రత్యేక రథం కూడా యాత్రలో పాల్గొంది. ఈ రథాలన్నీ అనంతపురం, ధర్మవరం మీదుగా పుట్టపర్తికి చేరుకోనున్నాయి.

శిలా మందిరంలో ప్రత్యేక పూజలు

ఈ కార్యక్రమానికి అఖిల భారత సత్యసాయి సేవా సమితుల అధ్యక్షుడు నిమిష్‌ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు, దక్షిణ భారత జోన్‌ అధ్యక్షుడు వెంకటరమణ గోసావి, జాతీయ యువ సమన్వయకర్త లక్ష్మీకాంత్‌, ఆంధ్ర రాష్ట్ర సేవా సమితుల అధ్యక్షుడు లక్ష్మణరావు, కర్ణాటక సేవా సమితుల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

బాలసాయి శిలా మందిరం వద్ద ఉన్న రాతిశిలకు రుద్రాభిషేకం, అర్చన నిర్వహించారు. వేదపఠనం, భజన కార్యక్రమాలతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారితో చారిత్రక అనుబంధం కలిగిన ప్రదేశంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ కార్యక్రమంలో విశేషంగా నిలిచింది.

నగర సంకీర్తనతో భక్తి సందడి

ఉదయం 7.30 గంటలకు స్వామివారు విద్యనభ్యసించిన శ్రీ కరిబసవ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఒక రథంతో నగర సంకీర్తన ప్రారంభమైంది. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ కార్యక్రమం సుంకులమ్మ గుడి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, స్వామివారు నివసించిన గృహం మీదుగా క్లాక్‌ టవర్‌ వరకు కొనసాగింది. భక్తుల భజనలు, సంకీర్తనలతో పట్టణంలో సందడి నెలకొంది.

అనంతరం స్వామివారు చదువుకున్న తరగతి గదిలో నూతనంగా నిర్మించిన పూజా మందిరాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కరిబసవ ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్‌ కళాశాల, బాలుర జూనియర్‌ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

జెండా ఊపి రథయాత్ర ప్రారంభం

ఉరవకొండ పట్టణంలోని వై జంక్షన్‌ నుంచి ఐదు ప్రేమ ప్రవాహిని రథాలతో పాటు జ్యోతిని కలిగిన ప్రత్యేక రథాన్ని అఖిల భారత అధ్యక్షుడు, ఇతర ప్రముఖులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి సమన్వయకర్తలతో పాటు జిల్లాలోని వివిధ సత్యసాయి సేవా సమితుల కన్వీనర్లు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.

విశ్వశాంతి, పరస్పర సౌహార్దం, ప్రేమాభిమానాల ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా బోధనలు, సందేశాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 126 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *