
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను ప్రస్తుతం నెమ్మదిగా కదులుతోందని గత ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకు 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 610 కిలోమీటర్లు విశాఖపట్నానికి 610 కిలోమీటర్లు ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించారు.
తుపాను కదలికలను ఆర్టీజీఎస్ విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగాలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తామని వెల్లడించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక అగ్నిమాపక సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల
అక్వాన్ తుపాను ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జెన్కో అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బలిమెల రిజర్వాయర్ నుంచి 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. గుంటవాడ రిజర్వాయర్‌కు చెందిన 10 గేట్లను ఎత్తి 10,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు తెలిపారు.
డొంకరాయి రిజర్వాయర్ గేట్లను కూడా అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పటికే మూడుసార్లు సైరన్ మోగించినట్లు పేర్కొన్నారు. డొంకరాయి రిజర్వాయర్ ఆరో నంబర్ గేటును ఎత్తి ప్రస్తుతం 2,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జెన్కో అధికారులు వెల్లడించారు.
