D Spiritual: Nov 18: పుట్టపర్తిలో విశ్వమానవాళికి సేవ, ప్రేమతత్వాన్ని చాటిచెప్పిన భగవాన్‌ శ్రీసత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి వేలాదిగా భక్తులు పుట్టపర్తికి తరలివస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక నగరి పుట్టపర్తి పండుగ శోభను సంతరించుకుంది.

జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ మందిరాన్ని సుందరంగా అలంకరించారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో తోరణాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్తు దీపాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. సాయిసన్నిధిలో వివిధ రంగాలకు చెందిన సాంస్కృతిక కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వీటి ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పనున్నారు.

బుధవారం నిర్వహించే శ్రీసత్యసాయి రథోత్సవంతో జయంతి వేడుకలు ప్రారంభమవుతాయి. మహాసమాధి చెంత ఉదయం 7 గంటలకు గురువందనం, 8 గంటలకు వేదపఠనం, సాయి భక్తిగీతాలతో కార్యక్రమాలు మొదలవుతాయి. అదే సమయంలో సాయి సత్యనారాయణ వ్రతాన్ని కూడా నిర్వహించనున్నారు.

అనంతరం గోపురం ద్వారం నుంచి పెద్ద వెంకమరాజు కల్యాణ మండపం వరకు ఉదయం 9.20 గంటలకు వేణుగోపాలస్వామి రథోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు రథంపై సత్యసాయి కాంస్య ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పట్టణంలోని పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు చేపట్టనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానుండటంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *