ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నూజివీడు అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

అటవీ శాఖ అధికారుల గుర్తింపు ప్రకారం పెద్దపులి లింగపాలెం, ధర్మాజీగూడెం, చింతలపూడి, చాట్రాయి, చిత్తపూర్, పోలవరం గట్ల మీదుగా ప్రయాణించి ముసునూరు మండలంలోని రమణక్కపేట ఫారెస్ట్ రేంజ్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

పులి కదలికల నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మారుమూల గ్రామాలు శివారు ప్రాంతాల్లోని దట్టమైన అటవీ మార్గాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు.

మరోవైపు, పెద్దపులిని సురక్షితంగా బంధించేందుకు మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. పులి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా బయట తిరగవద్దని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. పులి సంచారంపై సమాచారం అందడంతో గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. వీలైనంత త్వరగా పెద్దపులిని పట్టుకుని ప్రజలకు భద్రత కల్పించేందుకు అటవీ శాఖ చర్యలు కొనసాగిస్తోంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *