ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ప్రమాదంలో మత్స్యకారులకు చెందిన వందలాది వలలు దగ్ధం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.

అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇప్పటికే వేట విరామం కారణంగా ఉపాధికి దూరమైన మత్స్యకారులకు వలలు కూడా కాలిపోవడంతో మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. బాధితులకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2.0 కింద బాధితులకు కొత్త వలలు అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అగ్నిప్రమాద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.

పల్లెపాలెంలో రూ.10 కోట్ల విలువైన వలలు దగ్ధం

ప్రకాశం జిల్లా పల్లెపాలెంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మత్స్యకారులు షెడ్లలో నిల్వ ఉంచిన సుమారు 250 నుంచి 300 వలలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. వలలన్నీ ఒకే ప్రాంతంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 కోట్ల విలువైన మత్స్యకారుల వలలు కాలిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదం వెనుక ఏదైనా కారణం ఉందా అనే అనుమానాలను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు.

ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *