పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా బలపడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. గత ఆరు గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఈ తుపాను నరసాపురం, కళింగపట్నానికి 440 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్లు గోపాల్‌పూర్‌కు 530 కిలోమీటర్లు, పూరీకి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నరసాపురం-పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.

తుపాను ప్రభావంతో గురువారం, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గురువారం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *