16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నగరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని దీంతో నగర ప్రజల అభివృద్ధి కలలు త్వరలోనే సాకారం కానున్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి తరఫున మేయర్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న దానేటి రాధారాణిని గెలిపించాలని ప్రజలను కోరారు.

వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి తగ్గించిందని కూటమి ప్రభుత్వం మాత్రం 40 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. నగర అభివృద్ధి కోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో రూ.325 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టనున్నామని ప్రస్తుతం రూ.103 కోట్ల పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

సెంటిమెంట్‌ రాజకీయాలతో ప్రజలను ప్రభావితం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే నగర ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమావేశంలో మేయర్‌ అభ్యర్థి దానేటి రాధారాణి, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్‌, తేజేశ్వరరావు, కూటమి నాయకులు పైడిశెట్టి జయంతి, మాధవి, రవీంద్ర, పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు.

46 మంది టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

నగరపాలక సంస్థ ఎన్నికల్లోని 60 వార్డులకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగా 46 వార్డులకు చెందిన టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు బుధవారం రాత్రి ఎమ్మెల్యే గొండు శంకర్‌ బీ-ఫారాలు అందజేశారు.

టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌తో పాటు పలువురు అభ్యర్థులు బీ-ఫారాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, టీడీపీ నేత పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *