
D Spiritual: Nov 19: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి 8.34 లక్షల మంది భక్తులకు అవకాశం.. టీటీడీ విస్తృత ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ పది రోజుల్లో మొత్తం 8.34 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం టీటీడీ సాధికారిక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులకు సంబంధించి ఎస్ఎస్డీ (SSD) టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలి రెండు రోజులు సర్వదర్శనం ఉండదని, ఆ తర్వాతి ఎనిమిది రోజులు భక్తులకు సర్వదర్శనం అమలు చేస్తామని వివరించారు.
అలిపిరి–ఎస్వీ జూ పార్క్ రోడ్డుకు సమీపంలోని టీటీడీ స్థలంలో రూ.2,750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో యాత్రికుల టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్, డిజైన్ల తయారీతో పాటు నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2007 నాటి సీనియారిటీ జాబితా ఆధారంగా ఫేజ్-3లో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ప్లాట్లు కేటాయించేందుకు సాధికారిక మండలి ఆమోదం తెలిపిందని వివరించారు.
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అదనంగా 348 మంది సిబ్బందిని నియమించుకోవడానికి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో 321 మంది పారిశుద్ధ్య కార్మికులు, 27 మంది సూపర్వైజర్లు ఉన్నారు. వీరిని పొరుగు సేవల విధానంలో నియమించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్‌చంద్, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
