
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఇతర ముందస్తు సన్నాహాలపై రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఐసర్ వేదికగా వచ్చే నెల 4వ తేదీ నుంచి మూడు రోజులపాటు డీజీపీలు, ఐజీపీల జాతీయ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణ భద్రతా ఏర్పాట్లపై దాదాపు మూడు గంటలపాటు సమీక్షించారు.
సదస్సుకు హాజరయ్యే ప్రముఖులకు వసతి, రవాణా, భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఐజీ కాంతి రాణా టాటా, డీఆర్వో నరసింహులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఉన్నారు.
