తీవ్ర తుపాను అక్వాన్‌ ఉత్తరాంధ్ర తీరానికి సమీపంగా కదులుతూ ఒడిశా వైపు పయనిస్తోంది. బుధవారం రాత్రి కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం మధ్యాహ్నానికి విశాఖపట్నానికి సమాంతరంగా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తీర ప్రాంత నగరమైన విశాఖపట్నానికి తుపాను ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. గురువారం ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరగడంతోపాటు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

గురు, శుక్రవారాల్లో విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని బులెటిన్‌లో పేర్కొంది. గురువారం సాయంత్రం నుంచి వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని ఓ వాతావరణ నిపుణుడు తెలిపారు. తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ సముద్రం మరింత అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరించారు.

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున కొండవాలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్డీవో తహశీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ 24 గంటల పాటు పనిచేసేలా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

జీవీఎంసీ పరిధిలో 11 కంట్రోల్‌ రూమ్‌లు

తుపాను హెచ్చరికలతో జీవీఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో 11 కంట్రోల్‌ రూమ్‌లు లోతట్టు ప్రాంతాల్లో 55 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌. వర్మ తెలిపారు.

సహాయక చర్యల కోసం 30 జేసీబీలు, 70 టిప్పర్లు, 30 మినీ ఎక్స్‌కవేటర్లను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. నిరంతర సేవలందించేందుకు సిటీ ఆపరేషన్‌ సెంటర్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. తుపాను ప్రభావంతో చెట్లు కూలిపోతే వెంటనే తొలగించేందుకు హార్టికల్చర్‌ విభాగం ఆధ్వర్యంలో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పారిశుధ్య నిర్వహణ కోసం 98 రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి సహాయం అవసరమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనా 180042500009 నంబర్‌కు ఫోన్‌ చేయాలని, 9014218870 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా సంప్రదించాలని జీవీఎంసీ అధికారులు కోరారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *