
D Spiritual: Nov 19: తిరుమలలో ఘనంగా ఆయుధ పూజ.. అన్నప్రసాద సేవపై టీటీడీ కీలక ప్రకటన!
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో గురువారం ఆయుధ పూజ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
ముందుగా వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు తయారు చేసేందుకు ఉపయోగించే యంత్రాలు, పాత్రలకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో సేవలందిస్తున్న సిబ్బందిని ఈవో, అదనపు ఈవోలు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు అన్నప్రసాద సేవ కూడా యాత్రలో ఎంతో ముఖ్యమైన భాగమని తెలిపారు. గత రెండేళ్లలో అన్నప్రసాద ట్రస్టుకు సుమారు రూ.1,100 కోట్ల విరాళాలు అందాయని వెల్లడించారు. మొత్తం విరాళాల్లో 53 శాతానికి పైగా అన్నప్రసాద ట్రస్టుకే లభించడం విశేషమని పేర్కొన్నారు.
తిరుమలలో సాధారణ రోజుల్లో మూడు లక్షల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య రోజుకు సుమారు 4.60 లక్షలకు చేరుకుంటుందని వివరించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ 90 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు వెల్లడించారు.
1985లో కేవలం 2,000 మంది భక్తులతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు ఎంతో అభివృద్ధి చెందిందని వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రస్తుతం అన్నప్రసాద ట్రస్టు నిధులు సుమారు రూ.3,100 కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టీటీడీ పరిధిలోని 65 దేవాలయాల్లోనూ అన్నప్రసాద వితరణ అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సీవీఎస్వో మురళీకృష్ణ, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రితో పాటు పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
