తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు పెద్దఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత రెండేళ్లలో ఈ ట్రస్టుకు ఏకంగా రూ.1,100 కోట్ల విరాళాలు అందినట్లు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.

భక్తులు అందిస్తున్న విరాళాలతో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు నిధులు గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ట్రస్టు మొత్తం నిధులు సుమారు రూ.3,100 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సహకారంతో తిరుమలలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు.

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఆయుధ పూజ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి హాజరయ్యారు.

ముందుగా వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, వంట పాత్రలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం అన్నదాన సేవలో పాల్గొంటున్న సిబ్బందిని ఈవో, అదనపు ఈవోలు శాలువాలతో సత్కరించి అభినందించారు. భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు అందిస్తున్న సిబ్బంది సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

1985లో కేవలం 2,000 మంది భక్తులతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు ఎంతో విస్తరించిందని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు నిధులు సుమారు రూ.3,100 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో టీటీడీ పరిధిలోని 65 ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు అన్నప్రసాద సేవ కూడా యాత్రలో ఎంతో ముఖ్యమైన భాగమని అన్నారు.

గత రెండేళ్లలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు సుమారు రూ.1,100 కోట్ల విరాళాలు అందినట్లు వెంకయ్య చౌదరి వెల్లడించారు. టీటీడీకి అందుతున్న మొత్తం విరాళాల్లో 53 శాతానికి పైగా ఈ ట్రస్టుకే వస్తున్నాయని తెలిపారు.

ప్రస్తుతం తిరుమలలో సాధారణ రోజుల్లో మూడు లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య రోజుకు సుమారు 4.60 లక్షలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ 90 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భక్తుల విరాళాలు, సహకారంతో అన్నప్రసాద సేవలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు నేతృత్వంలోని కమిషన్ సభ్యుల బృందం తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలను సందర్శించింది. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర బాలమందిరం, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించింది.

ముందుగా శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలోని వంటశాల, స్టోర్‌ను సందర్శించిన కమిషన్ బృందం అక్కడి పరిశుభ్రత, నిర్వహణ తీరును పరిశీలించింది. సంబంధిత రికార్డులను సైతం తనిఖీ చేసింది. వంటశాల, స్టోర్‌లో పాటిస్తున్న పరిశుభ్రత, క్రమబద్ధమైన నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన సభ్యులు.. అధికారులను అభినందించారు.

అనంతరం ఇతర విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, సంరక్షణ, సంక్షేమ సదుపాయాలను సమీక్షించారు. పిల్లల హక్కుల పరిరక్షణతో పాటు వారి భద్రత, సమగ్ర అభివృద్ధి కోసం టీటీడీ చేపడుతున్న చర్యలను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, సురక్షిత వాతావరణం కల్పించే అంశాలపై అధికారులతో చర్చించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *