వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

నవంబర్ 19: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసులపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించగా.. ఈ రిపోర్టు సమర్పించడానికి 3 వారాల గడువు కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై తెలంగాణ హైకోర్టు అంగీకారం తెలుపుతూ.. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసులను త్వరగా తేల్చాలని ఈడీ, హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తులపై ఇప్పటికే సీబీఐ, ఈడీ అభియోగపత్రాలను దాఖలు చేసింది. సీబీఐ 11, ఈడీ 9 అభియోగపత్రాలు దాఖలు చేయగా.. 15 ఏళ్లుగా విచారణ కొనసాగుతోందని ఈడీ తరఫున న్యాయవాది వాదించారు. పలు కేసుల్లో 150కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి ఈడీ న్యాయవాది తీసుకెళ్లారు.

డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో కేసుల విచారణ ప్రాథమిక దశలోనే నిలిచిపోయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ వాదనలు వినిపించింది. కేసులను రోజువారీ విచారణను చేపట్టాలని కోరింది. నిందితులు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఈడీ కోరింది. కేసులను రోజువారీగా విచారించాలని హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది కోరారు. 2024లోనే రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పురోగతి లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అయితే ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ జడ్జిని ప్రతివాదిగా ఈడీ చేర్చడంపై హైకోర్టు ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసుల విచారణలో జాప్యం జరిగిందనే కారణంతో న్యాయమూర్తులను ప్రతివాదులుగా చేర్చడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహకరించేందుకు అమికస్ క్యూరీని నియమించే అంశాన్ని ధర్మాసనం పరిశీలించింది. అమికస్ క్యూరీ నియామకం ద్వారా కేసులో న్యాయపరమైన అంశాలపై సహాయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులకు సంబంధించి తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *