
D Spiritual: Nov 19: మనో బృందంతో భక్తి సంగీత స్వరార్చన.. శ్రీశైలంలో నవంబర్ 20న కోటి దీపోత్సవం!
నంద్యాల: జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా నవంబర్ 20న కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఆగమ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో సాయంత్రం 6 గంటల నుంచి దీపోత్సవం ప్రారంభం కానుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నామని, కార్యక్రమానికి అవసరమైన పూజా ద్రవ్యాలన్నింటినీ దేవస్థానం తరఫునే సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.
కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటల నుంచే పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనం, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు నాగూరుబాబు (మనో) తన బృందంతో కలిసి భక్తి సంగీత స్వరార్చన చేయనున్నారు. పలువురు ప్రముఖ గాయనీగాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలను ఆలపించనున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం భక్తి సంగీతంతో మార్మోగనుంది.
కోటి దీపోత్సవం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజాదికాలు నిర్వహించనున్నారు. అనంతరం ఓంకార హారతి, నాగ హారతి, త్రిశూల హారతి, నంది హారతి, సింహ హారతి, సూర్య హారతి, చంద్ర హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతులను సమర్పించనున్నారు. చివరగా మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ముగించనున్నారు.
వైదిక సంప్రదాయంలో దీపానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని దేవస్థానం అధికారులు వివరించారు. దీపజ్యోతిని యజ్ఞాగ్నికి సంకేతంగా భావిస్తారని, అది జ్ఞానం, వెలుగు, ఉత్సాహం, ఆనందం, శాంతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దీపారాధన ద్వారా ఈ దివ్య గుణాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారని పేర్కొన్నారు. శ్రీ స్వామి, అమ్మవార్లకు దీపజ్యోతిని సమర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని వెల్లడించారు.
ఈ పవిత్రమైన కోటి దీపోత్సవంలో భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల దివ్య ఆశీస్సులు పొందాలని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు కోరారు. కార్తీక మాసంలో శ్రీశైల క్షేత్రంలో నిర్వహించనున్న ఈ దీపోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.
