
కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడటం తీవ్రమైన నేరమని విద్యార్థుల భవిష్యత్తు, ఆత్మగౌరవం, మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏలూరులోని ఆశ్రం మెడికల్ కళాశాలలో గురువారం యాంటీ ర్యాగింగ్, మహిళా భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.
ఎంబీబీఎస్ విద్యలో అనేక సబ్జెక్టులు, ఒత్తిళ్లు ఉంటాయని వాటికి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చుకోవాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే భయపడకుండా కళాశాల యాజమాన్యానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.
అలాగే యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులకు అండగా నిలిచి వారిలో ధైర్యాన్ని నింపుతూ సరైన మార్గంలో నడిపించేవారే నిజమైన సీనియర్లని పేర్కొన్నారు. ర్యాగింగ్ ద్వారా ఇతరుల్లో భయాన్ని కలిగించడం గౌరవం కాదన్నారు.
ఒక వ్యక్తి మంచి మనసు, ప్రతిభ, వ్యక్తిత్వాన్ని గుర్తించి ఇతరులు మనస్ఫూర్తిగా ఇచ్చేదే నిజమైన గౌరవమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్, రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు, వన్‌టౌన్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్‌ఐ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
