
పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించి ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
శుక్రవారం ఉదయం నుంచే పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 144 సెక్షన్ అమల్లో ఉన్న ప్రాంతంలో ఎంపీ అవినాశ్ రెడ్డి భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు సమీపంలో ఆయన వాహన శ్రేణి, టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవి వాహనాలు ఎదురుపడ్డాయి.
దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో అవినాశ్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
