బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా సన్న రకాల బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో సన్న బియ్యం ధర రూ.90 దాటగా, 26 కిలోల బస్తా రూ.2,400కు పైగా పలుకుతోంది. పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతుబజార్లలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా ‘ధరణి’ పేరుతో 26 కిలోల బియ్యం బస్తాను రూ.1,300కు విక్రయిస్తోంది.

రిటైల్‌గా కిలో రూ.50 చొప్పున అందిస్తోంది. ఈ పథకం ప్రారంభంలో వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల నాణ్యమైన బియ్యమే విక్రయిస్తున్నారు. అయితే బ్రాండెడ్‌ బియ్యం ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. విశాఖ జిల్లాలో అక్షయ, లలిత వంటి బ్రాండ్లకు డిమాండ్‌ ఉండటంతో వ్యాపారులు పాత ధరలకే విక్రయిస్తున్నారు.

ధరల పట్టిక ఉన్నా అమలు కాని ఆదేశాలు

బియ్యం ధరలను నియంత్రించేందుకు పౌర సరఫరాల శాఖ తాజాగా వివిధ రకాల బియ్యానికి విక్రయ ధరలను నిర్ణయించింది. ఈ ధరల పట్టికలను నాలుగైదు రోజుల క్రితమే వ్యాపారులకు అందజేసి నిర్దేశించిన ధరలకే విక్రయించాలని సూచించింది. దుకాణాల్లో ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. అయినప్పటికీ పలువురు వ్యాపారులు ఈ సూచనలను పట్టించుకోకుండా అధిక ధరలకే బియ్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి.

పాత బస్తాలపై ఉన్న ఎంఆర్‌పీని సైతం పట్టించుకోకుండా మార్కెట్‌లో ధరలు పెరిగాయనే కారణంతో అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విజిలెన్స్‌, తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

తనిఖీల భయంతో డీమార్ట్‌లో బియ్యం కౌంటర్లు మూసివేత?

మరోవైపు ప్రభుత్వ ధరలకు బియ్యం విక్రయించడం ఇష్టం లేక డీమార్ట్‌ యాజమాన్యం బియ్యం కౌంటర్లను మూసివేసినట్లు తెలుస్తోంది. నగరంలోని సుమారు పది డీమార్ట్‌ స్టోర్లలో గతంలో కిలో రూ.60 నుంచి రూ.200 వరకు వివిధ రకాల బియ్యం అందుబాటులో ఉండేవి. బిర్యానీ తయారీకి ఉపయోగించే బాస్మతీ రకాలను కూడా విక్రయించేవారు.

అయితే అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు నిర్ణీత ధరల కంటే ఎక్కువకు అమ్ముతున్నారనే కారణంతో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని భావించి బాస్మతీ సహా అన్ని రకాల బియ్యాన్ని స్టోర్ల నుంచి తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయా దుకాణాల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ప్రైవేటు సూపర్‌ మార్కెట్లలో ఇంకా అధిక ధరలే

సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, అక్కయ్యపాలెం, గోపాలపట్నం, గాజువాక, కంచరపాలెం ప్రాంతాల్లోని ప్రైవేటు సూపర్‌ మార్కెట్లలో మాత్రం బియ్యం అధిక ధరలకే విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకు అక్కడ బియ్యం అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. కర్నూలు బీపీటీ సన్న బియ్యం పేరుతో కిలో రూ.89 నుంచి రూ.95 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

విజిలెన్స్‌ అధికారులు పూర్ణా మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని చిల్లర, రిటైల్‌ దుకాణాలపైనే తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రైవేటు సూపర్‌ మార్కెట్లపై దృష్టి సారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని రకాల దుకాణాల్లోనూ ప్రభుత్వ ధరల పట్టికలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అభిప్రాయపడుతున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *