
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో జిల్లాకు ముప్పు కొంత తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో గురువారం ఉదయం నుంచే జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం వర్షం కురవగా రాత్రి నుంచి మోస్తరు ఈదురుగాలులు వీస్తూ అడపాదడపా చినుకులు పడుతున్నాయి. జిల్లాకు తుఫాన్ ముప్పు పెద్దగా లేకపోయినా అక్కడక్కడా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు
కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు సముద్ర తీర ప్రాంత మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు కలెక్టర్ కార్యాలయంతో పాటు అనకాపల్లి, నర్సీపట్నం, అడ్డరోడ్డు ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను మరో 48 గంటల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు
- కలెక్టర్ కార్యాలయం: 08924-222888, 08924-225999
- అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం: 9014578858
- నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం: 08932-224420
- అడ్డరోడ్డు ఆర్డీఓ కార్యాలయం: 08931-293606
చేతికొచ్చే సమయంలో పంటకు నష్టం వాటిల్లుతుందేమో!
తుఫాన్ ముప్పు తగ్గినట్లు కనిపిస్తున్నా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట కోతకు సిద్ధంగా ఉండటంతో వర్షాలు ఈదురుగాలులు తమ శ్రమను వృథా చేస్తాయేమోనని భయపడుతున్నారు.
కొద్దిపాటి గాలులు వీచినా కోతకు వచ్చిన వరి పైరు నేలకొరిగే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు వర్షాలు కురిస్తే పొలాల్లో నీరు చేరి ధాన్యం తడిసిపోవడం రంగు మారడం మొలకెత్తడం వంటి సమస్యలు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావం తగ్గినా వర్షాల ముప్పు పూర్తిగా తొలగకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఆందోళనగా చూస్తున్నారు.
