
D Spiritual: Nov 20: తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం.. ఉగ్రశ్రీనివాసమూర్తికి ప్రత్యేక ఊరేగింపు!
నవంబర్ 21న కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉగ్రశ్రీనివాసమూర్తిని తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఆలయ మాడవీధుల్లో ఊరేగించనున్నారు. వేంకటతురైవార్, స్నపనబేరం అని కూడా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తికి ఈ ప్రత్యేక ఊరేగింపు ఏడాదిలో కేవలం కైశిక ద్వాదశి రోజున మాత్రమే నిర్వహించడం విశేషం.
కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం, ఉత్తాన ద్వాదశి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లి, కైశిక ద్వాదశి రోజున మేల్కొంటారు. అందుకే ఈ పర్వదినానికి వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని టీటీడీ ప్రత్యేకంగా నిర్వహిస్తుంది.
కైశిక ద్వాదశి ప్రాశస్త్యం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శ్రీ వరాహస్వామి కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో భూదేవికి ఈ విశేషాన్ని వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ ఆధారంగానే కైశిక ద్వాదశికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది.
ఈ పర్వదినానికి సంబంధించిన మరో విశేషం నంబదువాన్ కథ. నంబదువాన్ అనే పరమభక్తుడు కైశిక రాగంలో స్వామివారికి సంకీర్తన సమర్పించేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో బ్రహ్మరాక్షసుడు ఎదురవుతాడు. తన ఆకలి తీర్చాలని కోరగా, ముందుగా స్వామివారికి సంకీర్తన సమర్పించి తిరిగి వస్తానని నంబదువాన్ మాట ఇస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం తిరిగి రావడంతో అతని భక్తికి, సత్యనిష్ఠకు ముగ్ధుడైన స్వామివారు బ్రహ్మరాక్షసుడికి మోక్షం ప్రసాదించినట్లు పురాణ గాథ చెబుతోంది.
ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపును సూర్యోదయానికి ముందే నిర్వహించడం వెనుక కూడా చారిత్రక నేపథ్యం ఉంది. 14వ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు సమయంలో సూర్యకిరణాలు విగ్రహంపై పడటంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు చారిత్రక కథనం ఉంది. అప్పటి నుంచి ఎలాంటి అపశ్రుతులు జరగకుండా సూర్యోదయానికి ముందే ఈ ఊరేగింపును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఏడాది నవంబర్ 21న తెల్లవారుజామున 4.30 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉగ్రశ్రీనివాసమూర్తిని తిరుమాడవీధుల్లో ఊరేగించనున్నారు. అనంతరం ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణంతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో సాలకట్ల కైశిక ద్వాదశి ఉత్సవాలు ముగియనున్నాయి.
