దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్ల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్న వారికి మార్కెట్లో లెక్కలేనన్ని మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా కొత్త ఈవీ స్కూటర్ కొనేముందు తప్పనిసరిగా చూడాల్సిన 7 కీలక అంశాలివే..
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీతో పాటే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నారు. అందుకే ఒకప్పుడు పెట్రోల్ వాహనాలకు ఉండే భారీ డిమాండ్ ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ స్కూటర్ల (EV) వైపే ఉందనడంలో సందేహం అక్కర్లేదు. అంతే కాకుండా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయకుండా.. తక్కువ ఖర్చుతో సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడం కూడా వీటి కొనుగోళ్లుకు మరింత బలం చేకూరుస్తుంది.

ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఫీచర్స్ ఇవే..
1. మైలేజ్.. రోజువారీ ఆఫీస్ లేదా ఇతర పనుల కోసం స్కూటర్ వాడేవారికి రేంజ్ చాలా ముఖ్యం. కంపెనీలు చెప్పే సర్టిఫైడ్ రేంజ్‌ను చూసి మురిసిపోకుండా, మన రోజువారీ ప్రయాణ దూరాన్ని లెక్కేసుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్, రోడ్ల పరిస్థితి, మనం నడిపే వేగం, బరువును బట్టి అసలైన రేంజ్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే మన రోజువారీ అవసరాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సరిపోయే రేంజ్ ఇచ్చే మోడల్‌నే ఎంచుకోవాలి.
2. పర్ఫార్మెన్స్.. రద్దీగా ఉండే సిటీ ట్రాఫిక్‌లో స్కూటర్ ఎక్కడా తడబడకుండా దూసుకెళ్లాలి. ఇందుకోసం స్కూటర్ టాప్ స్పీడ్, రైడ్ మోడ్స్, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉన్నాయో గమనించాలి. సాధారణ ప్రయాణాల్లో బ్యాటరీ ఆదా చేసేందుకు ‘ఎకో మోడ్’, అవసరమైనప్పుడు వేగంగా దూసుకెళ్లేందుకు ‘స్పోర్ట్స్ మోడ్’ ఉన్న స్కూటర్లు చాలా సౌకర్యంగా ఉంటాయి.
3. స్టోరేజ్ స్పేస్.. రోజువారీ ప్రయాణాల్లో సీటు కింద ఉండే స్టోరేజ్ (బూట్ స్పేస్) పాత్ర చాలా కీలకం. హెల్మెట్, ఆఫీస్ బ్యాగ్, ఇంటికి కావాల్సిన సరుకులు పెట్టుకునేందుకు వీలుగా విశాలమైన స్థలం ఉండాలి. సరైన డిజైన్‌తో కూడిన బూట్ స్పేస్ ఉంటే, అదనంగా బ్యాగులు తగిలించుకునే బాధ తప్పుతుంది.
4. స్మార్ట్ ఫీచర్లు.. స్కూటర్లో ఉండే టెక్నాలజీ మన ప్రయాణాన్ని సులభతరం చేయాలే తప్ప, డ్రైవింగ్ నుంచి దృష్టి మళ్లించేలా ఉండకూడదు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, స్పష్టంగా కనిపించే డిజిటల్ డిస్ప్లే, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్లు రోజువారీ ప్రయాణాలను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి.
5. సేఫ్టీ ఫీచర్స్.. ఎలక్ట్రిక్ స్కూటర్లు పోల్చి చూసేటప్పుడు సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఎత్తుపల్లాల వద్ద స్కూటర్ వెనక్కి జారకుండా ఉండే ‘హిల్-హోల్డ్ అసిస్ట్’, పార్కింగ్‌లో సులభంగా వెనక్కి తీసేందుకు ‘రివర్స్ మోడ్’, యాంటీ-థెఫ్ట్ అలారం, నాణ్యమైన బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, ఇరుకు పార్కింగ్ స్థలాల్లో ఇవి ఎంతో భరోసానిస్తాయి.
6. ఛార్జింగ్ సదుపాయం.. ఛార్జింగ్ పెట్టడం అనేది మన దినచర్యలో ఒక భాగంగా కలిసిపోవాలి. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది, ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకునే వీలుందా అనేది చూడాలి. చాలామందికి రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి, ఉదయాన్నే స్కూటర్ తీయడం అలవాటు. కాబట్టి మన సమయానికి తగ్గట్టుగా వేగంగా, సురక్షితంగా ఛార్జ్ అయ్యే మోడల్ ఎంచుకోవడం ఉత్తమం.
7. ధర.. కేవలం ఎక్స్-షోరూమ్ ధర తక్కువగా ఉందని ఏదో ఒక స్కూటర్ కొనేయకూడదు. మనం పెట్టే డబ్బుకు తగ్గ విలువ లభిస్తుందా లేదా అని బేరీజు వేసుకోవాలి. బ్యాటరీ సామర్థ్యం, వారంటీ, సర్వీస్ నెట్వర్క్, బిల్డ్ క్వాలిటీ, ఫీచర్లు.. వీటన్నింటినీ కలిపి చూసినప్పుడే ఆ స్కూటర్ దీర్ఘకాలంలో మనకు ఎంతవరకు లాభదాయకమో స్పష్టమవుతుంది
