
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వివాదంలో మధ్యంతర జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ వద్ద విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత దశలో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవని స్పష్టం చేసింది. బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా సిరి సహస్ర పొందే ప్రయోజనాలన్నీ కలెక్టర్ జారీ చేసే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని పేర్కొంది.
సిరి సహస్ర బీసీ-డీ సామాజిక హోదాను వినియోగించుకోకుండా తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, స్థానికత, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించకుండా అధికారులను ఆదేశించాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రధాన వ్యాజ్యంపై తదుపరి విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది. జస్టిస్ ఎన్. హరినాథ్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏమిటీ వివాదం?
జైన్ కుటుంబంలో జన్మించిన సిరి సహస్రను మజ్జి శ్రీనివాసరావు 2020లో దత్తత తీసుకున్నారు. అనంతరం ఆమెకు తూర్పు కాపు/గాజుల కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా బీసీ-డీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన బొమ్మి శ్రీనివాసరావు సవాల్ చేశారు. జైన్ కుటుంబంలో జన్మించిన ఆమెకు ఓసీ హోదా వర్తిస్తుందని దత్తత తీసుకున్నంత మాత్రాన కులం మారదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరారు.
కోర్టులో ఇరుపక్షాల వాదనలు
పిటిషనర్ తరఫు న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ వాదనలు వినిపిస్తూ సిరి సహస్రకు బీసీ-డీ సర్టిఫికెట్ జారీ చేయడం చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ తరఫు న్యాయవాది ఈ వ్యవహారం ఎన్నికల వివాదానికి సంబంధించినదని అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని వాదించారు.
సిరి సహస్ర తరఫు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ స్పందిస్తూ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ ఇప్పటికే జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ కలెక్టర్ వద్ద కొనసాగుతోందని కోర్టుకు వివరించారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని అభ్యర్థించారు.
కలెక్టర్ తుది నిర్ణయమే కీలకం
ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కుల ధ్రువీకరణ పత్రంపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇప్పటికే సిరి సహస్రకు నోటీసులు జారీ చేసినట్లు గుర్తుచేసింది. చట్టంలోని రూల్ 9 ప్రకారం ఇలాంటి ఫిర్యాదులను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీకి పంపాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇరుపక్షాలు ఇప్పటికే కమిటీ ముందు హాజరయ్యాయని, విచారణ కొనసాగుతున్నందున ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకుంటే ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. బీసీ-డీ సర్టిఫికెట్ ఆధారంగా సిరి సహస్ర పొందే ప్రయోజనాలన్నీ కలెక్టర్ తుది నిర్ణయానికి లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
