
తిరుపతి జిల్లా పరిషత్‌కు తొలి చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే హేమలత చరిత్ర సృష్టించారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నాగలాపురం టీడీపీ జడ్పీటీసీ హేమలత చైర్‌పర్సన్‌గా, సూళ్లూరుపేట బీజేపీ జడ్పీటీసీ ఆరణి కిషన్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియకు మొత్తం 29 మంది జడ్పీటీసీలు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు.
హాజరైన సభ్యుల్లో టీడీపీకి చెందిన వారు 23 మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు, వైసీపీ నుంచి ఇద్దరు, ఒకరు స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. వైసీపీకి చెందిన కోడూరు పెనగలూరు జడ్పీటీసీలు అంబటి మురళి, దువ్వూరి సుప్రజ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
చైర్‌పర్సన్ పదవికి హేమలత ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులతో పాటు స్వతంత్ర జడ్పీటీసీ మద్దతు తెలిపారు. మొత్తం 26 మంది చేతులెత్తి మద్దతు ప్రకటించడంతో హేమలత ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. వైస్ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన ఆరణి కిషన్‌రెడ్డికి కూడా అదే స్థాయిలో మద్దతు లభించడంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తొట్టంబేడు జడ్పీటీసీ రావిళ్ల మునిరాజనాయుడు సమావేశానికి హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీ సీఈవో శోభన్‌బాబు, డీఆర్‌డీఏ పీడీ రమణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు జడ్పీటీసీలు గైర్హాజరు
ప్రత్యేక సమావేశానికి ఐదుగురు జడ్పీటీసీలు హాజరుకాలేదు. వీరిలో బీజేపీకి చెందిన రేణిగుంట జడ్పీటీసీ జీపాలెం తేజోవతితో పాటు వైసీపీకి చెందిన ఎర్రావారిపాలెం, తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు, పెళ్లకూరు జడ్పీటీసీలు ఊటుకూరి రెడ్డెమ్మ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, బాలం యుగంధర్‌రెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఉన్నారు.
చేతులెత్తి మద్దతు కోరడంపై చర్చ
తిరుపతి జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణ తీరు చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి హాజరైన 29 మందిలో ఇద్దరు వైసీపీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో మిగిలిన 27 మందిలో 26 మంది కూటమి సభ్యులు కాగా ఒకరు స్వతంత్ర సభ్యుడు. ఆయన కూడా కూటమికి మద్దతుగా వ్యవహరించారు.
రెండు పదవులకూ ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో పోటీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో హేమలత ఆరణి కిషన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. అయితే పోటీ లేకపోయినప్పటికీ అధికారులు సభ్యులను చేతులెత్తి మద్దతు ప్రకటించాలని కోరడం చర్చకు దారితీసింది.
సాధారణంగా ఒక పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసినప్పుడు సభ్యుల మద్దతును చేతులెత్తించి లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇక్కడ ప్రత్యర్థి అభ్యర్థులు లేకపోయినా అదే విధానాన్ని అనుసరించడంపై పలువురు చర్చించుకుంటున్నారు.
