ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

తిరుపతి నుంచి బాపట్లకు పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కారు పెళ్లూరు సమీపంలో కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి మృతిచెందినట్లు తెలిపారు.

గాయపడిన ఇద్దరిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం హోంమంత్రి అనిత

పెళ్లూరు వద్ద జరిగిన ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బృందం ప్రమాదానికి గురికావడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో నలుగురు మృతిచెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు మంత్రుల సానుభూతి

పెళ్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితతో పాటు మంత్రులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనలు విడుదల చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *