
కార్తీక మాస ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
సాయంత్రం స్వామివారికి బిల్వార్చన, ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణతో పాటు ఊయల సేవను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం నిర్వహించిన పంచహారతులు, వేదస్వస్తి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆలయ స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు పద్మావతి ఠాకూర్, సరిత తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
