
ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా గంపలగూడెం జెడ్పీటీసీ సభ్యురాలు కోట పుల్లమ్మ (టీడీపీ), వైస్ చైర్‌పర్సన్‌గా విజయవాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నూతలపాటి బాలకోటేశ్వరరావు (బీజేపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శుక్రవారం విజయవాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి.ఎస్ సమక్షంలో తొలుత 16 మంది జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. దీంతో నూతన పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది.
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పీటీసీలు
ఏ.కొండూరు నుంచి అన్నే కమల కుమారి, చందర్లపాడు నుంచి అపర్ణ శాఖమూరి, జి.కొండూరు నుంచి వేములకొండ రేవతి చంద్రిక, గంపలగూడెం నుంచి కోట పుల్లమ్మ, ఇబ్రహీంపట్నం నుంచి రెంటపల్లి వెంకటేశ్వరరావు, జగ్గయ్యపేట నుంచి మండవ శ్రీనివాసరావు, కంచికచర్ల నుంచి మూరకొండ ఏడుకొండలరావు, మైలవరం నుంచి రాంబాబు గుగులోతు, నందిగామ నుంచి అమృతమ్మ వేల్పుల, పెనుగంచిప్రోలు నుంచి జిల్లేపల్లి సుధీర్ బాబు, రెడ్డిగూడెం నుంచి వంకలపాటి అరుణ శేషకుమారి, తిరువూరు నుంచి ప్రమీల చాట్ల, వత్సవాయి నుంచి రాంబాబు వడ్లమూడి, వీరులపాడు నుంచి యిప్పల వెంకట కృష్ణారెడ్డి, విజయవాడ రూరల్ నుంచి నూతలపాటి బాలకోటేశ్వరరావు, విస్సన్నపేట నుంచి మట్టా సుజాత ప్రమాణ స్వీకారం చేశారు.
నూతన పాలకవర్గానికి అభినందనలు
ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా పరిషత్ సీఈఓ పి. సుశీల తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ నూతన చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు జెడ్పీటీసీ సభ్యులను కలిసి అభినందనలు తెలిపారు.
