
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నమెంట్లో భారత్-ఎ జట్టు ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర శతకాలతో చెలరేగగా.. బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా ప్రత్యర్థి బ్యాటర్లను వణికించారు. ఫలితంగా నేపాల్ కేవలం 26 పరుగులకే కుప్పకూలింది.
తిలక్, కుశాగ్ర శతకాల మోత
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎకు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. నాలుగో వికెట్‌కు 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.
తిలక్ వర్మ 113 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 107 పరుగులు చేయగా.. కుశాగ్ర 102 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 117 పరుగులు సాధించాడు. వైభవ్ సూర్యవంశీ 26 పరుగులు చేశాడు. చివర్లో సూర్యాంశ్ షెడ్జే 36 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్-ఎ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది.
26 పరుగులకే నేపాల్ కుప్పకూలింది
333 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ప్రిన్స్ యాదవ్ కేవలం 6 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా 16 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు.
దీంతో నేపాల్ 11.3 ఓవర్లలో కేవలం 26 పరుగులకే ఆలౌటైంది. ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. పవన్, రషీద్ చెరో 6 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఒక దశలో కేవలం ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయిన నేపాల్ చివరి వరకు కోలుకోలేకపోయింది.
లిస్ట్-ఎ క్రికెట్లో ఐదో అత్యల్ప స్కోరు
నేపాల్ సాధించిన 26 పరుగులు లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలో ఐదో అత్యల్ప స్కోరుగా నమోదయ్యాయి. ఈ జాబితాలో వెస్టిండీస్ అండర్-19 జట్టు చేసిన 18 పరుగులు ఇప్పటికీ అత్యల్ప స్కోరుగా కొనసాగుతున్నాయి. ఈ విజయంతో భారత్-ఎ టోర్నీలో శుభారంభం చేసింది. తదుపరి మ్యాచ్‌లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-ఎతో తలపడనుంది.
