
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌పై బొత్స ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయని స్పష్టం చేశారు.
బీసీలపై ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎందుకు టికెట్లు కేటాయించలేదని చిన్న శ్రీను ప్రశ్నించారు. బొబ్బిలి మున్సిపాలిటీలోనూ బీసీలకు ఎందుకు అవకాశాలు కల్పించలేదని నిలదీశారు. వెనుకబడిన వర్గాలపై నిజంగా ప్రేమ ఉంటే ఆచరణలో చూపించాలని డిమాండ్ చేశారు.
చట్టాలపైనా న్యాయస్థానాలపైనా వైసీపీకి గౌరవం లేదని చిన్న శ్రీను విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశమేనని ఈ విషయాన్ని తాము గర్వంగా చెబుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
