డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్ చేశానన్న ఆరోపణలతో తాను తీవ్రంగా బాధపడ్డానని టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించాడు. ఆ క్లిష్ట సమయంలో భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ రెండుసార్లు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నాడు.

నైపుణ్యం కలిగిన క్రికెటర్లలో సర్ఫరాజ్ ఖాన్ ఒకరు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ అతడికి అవకాశాలు మాత్రం ఎక్కువగా రావడం లేదు. జట్టులో తీవ్రమైన పోటీతోపాటు రెండేళ్ల కిందట డ్రెస్సింగ్‌ రూమ్‌కు సంబంధించిన విషయాలను లీక్‌ చేసినట్లు సర్ఫరాజ్‌పై ఆరోపణలు రావడంతో మేనేజ్‌మెంట్ అతడిని పక్కన పెట్టింది. ఈ క్రమంలోనే టీమిండియాలోకి పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆకాశ్‌ చోప్రాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న సర్ఫరాజ్ ఖాన్ పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. లీక్‌ ఆరోపణలు, కుటుంబ ఆర్థిక కష్టాల గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.

సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ… ‘ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సంబంధించిన విషయాలను లీక్‌ చేసినట్లు నాపై ఆరోపణలు వచ్చిన సమయంలో చాలా బాధపడ్డాను. నేను ఫ్లైట్ దిగి ఇంటికెళ్తుంటే పెద్ద సంఖ్యలో ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. కొందరు సోషల్ మీడియాలో ఏదేదో రాసేశారు. ఒకవేళ నిజంగానే అలా జరిగి ఉంటే.. భారత్ -ఏ జట్టుకు, శ్రీలంక సిరీస్‌కు ఎంపికయ్యేవాడిని కాదు కదా. నాపై ఆరోపణలు వచ్చిన సమయంలో కొందరికి ఫోన్ చేస్తే.. స్పందించలేదు. దీంతో మానసికంగా కుంగిపోయి.. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాను. ఆ సమయంలోనే ప్రధాన కోచ్‌ గంభీర్‌ సర్ (Gautam Gambhir) రెండు సార్లు కాల్ చేశారు’ అని సర్ఫరాజ్ ఖాన్ వెల్లడించాడు.

‘గంభీర్ సర్ మాట్లాడుతూ.. బయట వినిపించే అనవసరమైన మాటలను పట్టించుకోవద్దు. ఆటమీదే దృష్టి పెట్టమని సూచించారు. ‘నేను పరిస్థితులను అర్థం చేసుకోగలను సర్. కానీ, మా నాన్న చాలా బాధపడుతున్నారు. నా భార్య కూడా ఏడుస్తోంది’ అని ఆయనకు చెప్పాను. అప్పుడు గంభీర్‌ సర్ మా నాన్నతో మాట్లాడి.. అలాంటి మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆపి, సర్ఫరాజ్‌ను క్రికెట్ ఆడనివ్వమని, ఎందుకంటే అతను మంచి క్రికెటరని చెప్పారు. ఏ సహాయం అవసరమైనా ఫోన్ చేయమని మా నాన్నతో చెప్పారు ఆ క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఫోన్‌ చేసిన తొలి వ్యక్తి ఆయనే’ అని సర్ఫరాజ్ నాటి సంఘటలను గుర్తుచేసుకున్నాడు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *