
హామీ ఇచ్చి మాట మార్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం అన్న కుమారులకు న్యాయం జరగకపోతే రాజీనామాల ఉపసంహరణ ఉండదని స్పష్టం ఢిల్లీ పెద్దలకు ఏపీ పరిణామాలపై వివరించిన ఆది నారాయణరెడ్డి
అమరావతి,
కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఇచ్చిన హామీని చివరి నిమిషంలో మార్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అన్న కుమారుడికి జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి, చివరకు మరో వ్యక్తి పేరును ఖరారు చేయడంపై మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.
ఈ నిర్ణయంపై పునరాలోచన చేయకపోతే తాను, తన అన్న కుమారులు, జెడ్పీటీసీలుగా గెలిచిన రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తమ రాజీనామాల ఉపసంహరణ విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీకి తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చలు జరిపినప్పటికీ సంతృప్తికరమైన పరిష్కారం లభించలేదని వెల్లడించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ ముఖ్య నాయకులకు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించినట్లు ఆది నారాయణరెడ్డి తెలిపారు. సంబంధిత నివేదికలతో ఢిల్లీకి రావాలని వారు సూచించినట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టత వచ్చే వరకు రాజీనామాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగే చర్చలు, తదుపరి పరిణామాలను బట్టి తన భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు.
