
D Spiritual: Nov 21: కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
కార్తీక మాస ఏకాదశి, శుక్రవారం పర్వదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. కనకదుర్గమ్మ దర్శనం కోసం నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విదేశీ భక్తులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు భవానీ దీక్షల మాలధారణ కార్యక్రమం ప్రారంభం కావడంతో కొండపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక పెరగడంతో ఆలయ ప్రాంగణం, కొండ పరిసరాలు కిటకిటలాడాయి. ఉచిత దర్శన క్యూలైన్లతోపాటు రూ.100, రూ.300 టికెట్ దర్శనాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తుల రద్దీ క్రమంగా పెరగడంతో ఆలయ అధికారులు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలకు కూడా తాత్కాలికంగా విరామం ప్రకటించి సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనంలో ప్రాధాన్యత కల్పించారు. భవానీ మాలధారులు సైతం పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
నిత్య ఆర్జిత సేవల్లో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ఖడ్గమాలార్చన, కుంకుమ పూజలు, శ్రీచక్ర నవార్చన, చండీ హోమం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వరస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు మల్లేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. అనంతరం మెట్ల మార్గంలో అన్నదాన భవనానికి చేరుకుని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
