
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కార్పొరేటర్ స్థానాలతో పాటు మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
శనివారం రాత్రి శ్రీకాకుళంలోని తన నివాసంలో ఎన్నికల సన్నాహక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని కోరారు. సమన్వయంతో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జడ్పీ చైర్పర్సన్ కొరికాన భవానితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
