
భారత స్టార్ చెస్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి టోటల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ టూర్ పైలట్ టోర్నమెంట్‌ను పదో స్థానంతో ముగించాడు. 9-10 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ పోరులో రెండో రోజు అర్మేనియాకు చెందిన హయిక్ మార్టిరోస్యాన్ చేతిలో 9-11తో పరాజయం పాలయ్యాడు. బ్లిట్జ్ విభాగంలో మూడు గేమ్‌లు గెలిచి, ఒక గేమ్‌లో ఓడిన అర్జున్.. ర్యాపిడ్‌లో ఒక గేమ్ ఓడిపోయి, మరో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. క్లాసికల్ విభాగంలో రెండు గేమ్‌లను కోల్పోవడంతో అతడికి ఓటమి తప్పలేదు.
ప్రజ్ఞానందకు 21వ స్థానం
మరో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఈ టోర్నీలో 21వ స్థానంలో నిలిచాడు. రెండో రోజు జరిగిన పోరులో అభిమన్యు మిశ్రాపై 15-5తో ఘన విజయం సాధించాడు. ప్రజ్ఞానంద సోదరి వైశాలి మాత్రం 24వ స్థానంతో సరిపెట్టుకుంది. ఉజ్బెకిస్థాన్ ఆటగాడు అబ్దుసత్తోరోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 0-20తో ఓటమి చవిచూసింది.
అలీరెజాకు టైటిల్
ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజా ఫిరౌజా టోర్నీ విజేతగా నిలిచాడు. ఫైనల్ పోరులో తొలి రోజు నెదర్లాండ్స్ ఆటగాడు అనీష్ గిరి 11-8తో ఆధిక్యం సాధించగా.. రెండో రోజు అలీరెజా 12-9తో పైచేయి సాధించాడు. దీంతో ఇరువురి మధ్య పోరు ఆర్మగెడన్కు చేరింది. ఈ నిర్ణయాత్మక గేమ్ 35 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. ఆర్మగెడన్లో నల్ల పావులతో ఆడే ఆటగాడికి డ్రా వచ్చినా విజయం దక్కుతుంది. ఈ నిబంధనతో అలీరెజా టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇక ప్రపంచ నంబర్‌వన్, నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ ఈ టోర్నీని 17వ స్థానంతో ముగించడం గమనార్హం.
