
అంధుల క్రికెట్ ఆసియా కప్ ఫైనల్ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. టోర్నీలో పాకిస్థాన్‌కు విజేతగా కప్ అందించడంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా.. తాజాగా ఆ దేశానికి చెందిన అంపైర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. పాక్ జట్టుతో కలిసి అంపైర్ కూడా సంబరాల్లో పాల్గొనడం భారత అంధుల క్రికెట్ వర్గాలకు ఆగ్రహం తెప్పించింది.
ఢాకా వేదికగా జరిగిన అంధుల క్రికెట్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే వర్షం కారణంగా తుదిపోరు రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించకుండా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా పాకిస్థాన్‌కు విజేత హోదా కల్పించారు. దీంతో పాక్ జట్టు ట్రోఫీని అందుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత జట్టు ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించింది.
పాక్ అంపైర్ సంబరాలపై అభ్యంతరం
సాధారణంగా క్రికెట్లో అంపైర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. మ్యాచ్ ఫలితం తర్వాత విజేత జట్టుకు అభినందనలు తెలిపి తమ విధులకు పరిమితం కావాలి. కానీ ఈ టోర్నీలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించిన పాకిస్థాన్‌కు చెందిన అంపైర్.. తమ జట్టుకు కప్ దక్కడంతో ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకోవడం వివాదానికి కారణమైంది.
భారత జట్టుకు అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్న సమయంలో అంపైర్ వ్యవహరించిన తీరు మరింత విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ‘ఫ్లైట్ క్రాష్’ తరహా సంబరాల్లో అతడు పాల్గొనడంపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.
CABI తీవ్ర అసంతృప్తి
పాకిస్థాన్ అంపైర్ తీరుపై భారత అంధుల క్రికెట్ సంఘం (CABI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆసియా కప్ మొత్తం అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి.. పాక్ జట్టుతో కలిసి ఎలా సంబరాలు చేసుకుంటారని ప్రశ్నించింది. అంపైర్లు తటస్థంగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరించారని అసహనం వ్యక్తం చేసింది.
మైదానంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అంపైర్.. ఒక జట్టు విజయాన్ని తన విజయంగా భావించి సంబరాల్లో పాల్గొనడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
