
పులివెందుల నియోజకవర్గంలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గుండెపోటుతో మృతి చెందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా యంత్రాంగం పార్టీ నాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
నామినేషన్ల పరిశీలన సమయంలో జరిగిన పరిణామాలు అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. విచారణ నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. మృతుడు రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విచారణను ప్రత్యేకంగా పర్యవేక్షించే బాధ్యతను మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలపై పూర్తి వివరాలు సేకరించి విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.
మరోవైపు రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలిచేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్‌ను పులివెందులకు పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రామాంజులు కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
