ఐఐటీ విద్యార్థులకు లభిస్తున్న గౌరవం గుర్తింపు ఐటీఐ విద్యార్థులకు కూడా సమానంగా దక్కాలని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆకాంక్షించారు. నైపుణ్య ఆధారిత వృత్తి విద్యకు సమాజంలో మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత సాంకేతిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు కలిగిన కార్మికులకు భవిష్యత్తులో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. పరిశ్రమలు తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు డిమాండ్‌ మరింత పెరగనుందని తెలిపారు.

కేవలం అకడమిక్‌ విద్యకే పరిమితం కాకుండా వృత్తి విద్యకు కూడా సముచిత గుర్తింపు గౌరవం కల్పించాలని లోకేశ్‌ పేర్కొన్నారు. ఐటీఐ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారు ఎంచుకున్న వృత్తి పట్ల గర్వపడేలా సమాజంలో సానుకూల దృక్పథం ఏర్పడాలని ఆకాంక్షించారు. నైపుణ్య విద్యను గౌరవించే సంస్కృతి పెంపొందినప్పుడే యువతకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *