తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై మంత్రులతో ఆయన చర్చించారు. గ్రామాభివృద్దికి ఉపయోగపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలను పోత్సహించాలన్నారు

తెలుగు దేశం పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై మంత్రులతో ఆయన చర్చించారు. గ్రామాభివృద్దికి ఉపయోగపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలను పోత్సహించాలన్నారు. ఏకగ్రీవాలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయన్నారు. మునిసిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం రెండున్నరేళ్ల పాలనకు దక్కిన గుర్తింపు అన్నారు. కూటమితోనే ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని, కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు నమ్మకం ఉంచారని అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఏకపక్షంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గొడ్డలి పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి కనిపించాలి
పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి కనిపించాలని, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఓట్లుగా మలచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే తీర్పు వచ్చిన నేపథ్యంలో పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలన్నారు. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. 5 వేల లోపు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉంటే రూ.25 లక్షలు,10 వేలుపై జనాభా ఉంటే రూ.50 లక్షలు ఇచ్చే విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. పార్టీ గుర్తు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను కూటమి ప్రోత్సహించాలన్నారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవాలు జరిగితే వచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ది పనులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పార్టీలో నేతల మధ్య పంతాలు, ఇగోలు కాకుండా ఐక్యత కనిపించాలన్నారు.
