
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాల విషయంలో ఒడిశా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు గ్రామాల గిరిజనులపై పోలీసుల వేధింపుల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు.
ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సాలూరు నియోజకవర్గ పరిధిలోని కొఠియా గ్రామాల ప్రజలను ఒడిశా పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించాలని ఒడిశా పోలీసులు గ్రామస్థులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఆరుగురు గిరిజనులను ఒడిశా పోలీసులు తీసుకెళ్లినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఆదివారం ఉదయం మంత్రి సంధ్యారాణిని కలిసిన కొఠియా గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తమ గ్రామాల్లో ఒడిశా పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై మంత్రి తీవ్రంగా స్పందించారు.
మరోవైపు కొఠియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి భువనేశ్వర్‌లో స్పష్టం చేశారు. ఇప్పటికే అక్కడ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అడ్డుకోగలిగామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
