Rice Price: మీరు బియ్యం కొనేటప్పుడు కిలో ధరను సరిచూసుకోండి. బ్రాండెడ్ 5 కిలోల ప్యాకెట్ల కంటే 26 కిలోల బస్తాలు చౌకగా లభిస్తాయి. పన్ను కూడా ఉండదు. పాత బియ్యం, కొత్త బియ్యం ధరల్లో వ్యత్యాసం నిల్వ ఖర్చులు, వడ్డీ, రుచికి చెల్లించే ధర. తెల్ల రేషన్ కార్డు ఉంటే కుటుంబ సభ్యులకు ఉచిత సన్న బియ్యం లభిస్తుంది. జులై నుంచి అక్టోబర్‌కు పెరిగిన రూ.600 పాత నిల్వలు
Rice Price: హైదరాబాద్‌లోని వినియోగదారులు జులైలో రూ.1,400కు కొనుగోలు చేసిన 26 కిలోల సన్న బియ్యం బస్తా, అక్టోబర్‌కు రూ.2,000కు చేరుకుంది. కేవలం మూడు నెలల వ్యవధిలో రూ.600 వరకు పెరిగింది. ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలు, సరఫరా గొలుసులో ఎవరు ఎంత లాభం పొందుతున్నారనేది తెలుసుకుందాం.

26 కిలోల రహస్యం:
మనం సాధారణంగా పాతిక కిలోల బస్తా అంటాం. కానీ తెలంగాణలో సన్న బియ్యం బస్తాలపై 26 కిలోలు అని ఉంటుంది. దీనికి కారణం జీఎస్టీ నిబంధనలు. 25 కిలోలు లేదా అంతకంటే తక్కువ బరువుతో ప్యాక్ చేసి, లేబుల్ చేసిన బియ్యంపై 5% పన్ను వర్తిస్తుంది. 25 కిలోలు దాటితే పన్ను సున్నా. ఈ నియమం కారణంగా మిల్లులు ఒక కిలో అదనంగా నింపుతాయి. వినియోగదారులకు పన్ను భారం తగ్గుతుంది. అయితే, కొన్నిచోట్ల వ్యాపారులు 25 కిలోల బస్తాలకు 26 కిలోల లేబుల్ అంటించినట్లు ప్రభుత్వ తనిఖీల్లో వెల్లడైంది.
కష్టానికి తగ్గ ఫలితం?
ఒక కిలో సన్న బియ్యం తయారీకి దాదాపు 1.75 కిలోల వడ్లు అవసరం. 26 కిలోల బస్తాకు సుమారు 45 కిలోల వడ్లు కావాలి. పాత బియ్యానికే డిమాండ్ ఎక్కువ కాబట్టి, జులైలో విక్రయించిన బియ్యం గత పంట వడ్ల నుంచి వచ్చినవే. గత సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో బోనస్‌తో కలిపి క్వింటాల్ వడ్ల ధర రూ.2,900. ప్రైవేట్‌గా అమ్ముకున్న రైతులకు రూ.2,300 నుంచి రూ.2,600 వరకు లభించింది. రూ.2,600 ధరతో లెక్కిస్తే, మన బియ్యంలో కిలో వెనక రైతుకు రూ.45 దక్కింది. ఎకరాకు రూ.35,000 ఖర్చయితే, 22 క్వింటాళ్ల దిగుబడితో సొంత భూమి ఉన్న రైతుకు కిలోకి రూ.17 మిగులుతుంది. కౌలు రైతుకు మాత్రం కిలోపై కేవలం రూ.6 మాత్రమే మిగిలింది.
100 కిలోల వడ్లు మిల్లులోకి వెళ్తే, దాదాపు 58 కిలోల మంచి బియ్యం వస్తాయి. మిగిలిన 8 కిలోల నూకలు, 7 కిలోల తవుడు, 21 కిలోల పొట్టును మిల్లు విడిగా అమ్ముకుంటుంది. క్వింటాల్ వడ్ల మీద సుమారు రూ.400 అదనపు ఆదాయం మిల్లుకు వస్తుంది. అంటే కిలో బియ్యం మీద రూ.7. కరెంట్, కూలీలు, బస్తాల ఖర్చులు పోగా, పాత బియ్యం నిల్వ చేయాలంటే నెలల తరబడి వేచి ఉండాలి. దీనిపై నెలకి 2% వడ్డీ కూడా పెద్ద ఖర్చు. జులై నాటికి మిల్లుకు కిలోపై దాదాపు రూ.2 మాత్రమే లాభం మిగిలింది.
రవాణా, వ్యాపారుల వాటా:
మిల్లు నుంచి హైదరాబాద్‌లోని హోల్‌సేల్ గోదాములకు రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు కలిపి కిలోకి రూ.1.50లోపే. హోల్‌సేల్ వ్యాపారి మిల్లు రేటుపై కిలోకు ఒక రూపాయి లాభం, ఒక రూపాయి ఖర్చులు కలుపుతారు. రిటైల్ షాప్‌లో కూడా కొనుగోలు ధరపై కిలోకు సుమారు రూ.2 లాభం వేసి అమ్ముతారు. ఈ లెక్కన జులైలో కిలో రూ.54 ఉన్న బియ్యంలో రైతు వాటా రూ.45 కాగా, మిగిలిన రూ.9 మిల్లు, రవాణా, వ్యాపారులు, షాప్‌కు కలిపి వెళ్లాయి.
అక్టోబర్ ధరల పెరుగుదల: ఎవరికి లాభం?
అక్టోబర్‌లో బస్తా ధర రూ.2,000కు చేరడంతో కిలో రూ.77 అయ్యింది. పెరిగిన రూ.23లో లారీ, హమాలీ, వ్యాపారుల వాటాలో పెద్దగా మార్పు లేదు. పెరుగుదల మొత్తం మిల్లు రేటులో ఉంది. జులైలో కిలో రూ.50 ఉన్న మిల్లు రేటు అక్టోబర్‌లో రకాన్ని బట్టి రూ.65 నుంచి రూ.85కి పెరిగింది. ఈ అక్టోబర్‌లో మీరు కొన్న పాత బియ్యం గత పంట వడ్లతో తయారైనవే. చాలా మంది రైతులు పంట కోయగానే వడ్లను విక్రయించారు కాబట్టి, ఈ రూ.600 పెరుగుదలలో వారికి ఒక్క రూపాయి కూడా దక్కలేదు. ఈ పెరుగుదల నిల్వ ఎవరి దగ్గర ఉంటే వారికే దక్కింది – అది మిల్లులు, హోల్‌సేల్ వ్యాపారులు లేదా వడ్లు నిల్వ ఉంచుకోగలిగిన కొద్దిమంది రైతులకు. సెప్టెంబర్ చివరి నాటికి మహబూబాబాద్‌లో క్వింటాల్ రూ.2,400 ఉన్న పాత వడ్లు రూ.3,000- రూ.3,300కు అమ్ముడయ్యాయి.
ప్రభుత్వ పాత్ర, కొత్త పంట సవాళ్లు
ప్రభుత్వం ఉచిత రేషన్ కింద 3.43 కోట్ల మందికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తుంది. దీని కోసం గత వానాకాలంలో 38 లక్షల టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసింది. ఇది బయటి మార్కెట్‌కు సన్న బియ్యం లభ్యతను తగ్గించింది. అక్టోబర్‌లో కొత్త పంట వచ్చింది. ఈ వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 67 లక్షల ఎకరాల నుంచి 56.5 లక్షలకు తగ్గింది. పక్క రాష్ట్రాల వ్యాపారులు, మిల్లర్లు పొలాల దగ్గరే కొనుగోలు చేయడంతో ప్రైవేట్‌లో ధరలు పెరిగాయి. పచ్చి వడ్లకు క్వింటాల్ రూ.3,000-రూ.3,300, ఎండిన మంచి రకాలకు రూ.4,000 దాటింది. నీరు అందిన రైతులకు ఈ సీజన్ మంచిదే అయినా, నీరు లేక అనేక పొలాలు ఎండిపోయాయి, ఎరువుల ఖర్చులు పెరిగాయి.
ధరల నియంత్రణ, దాని ప్రభావం:
అక్టోబర్ 31న ప్రభుత్వం మిల్లర్లతో మాట్లాడి గరిష్ట ధరలు నిర్ణయించింది. బీపీటీ, కేఎన్ఎం రకాలు కిలో రూ.66, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ, జైశ్రీరామ్ రూ.79. బియ్యం ధరకి పరిమితి పెడితే, వడ్ల ధరకి కూడా పరోక్షంగా పరిమితి ఏర్పడుతుంది. బీపీటీ బియ్యం కిలో రూ.66 వద్ద, మిల్లు ఎండిన వడ్లకు క్వింటాల్‌కు రూ.3,600, పచ్చి వడ్లకు రూ.3,000 మాత్రమే చెల్లించగలదు. ఈ నిర్ణయం తర్వాత మిర్యాలగూడలో వడ్ల ధరలు రూ.4,000-₹4,200 నుంచి రూ.3,500కు తగ్గాయని రైతులు ఆందోళన చేశారు.
మీరు బియ్యం కొనేటప్పుడు కిలో ధరను సరిచూసుకోండి. బ్రాండెడ్ 5 కిలోల ప్యాకెట్ల కంటే 26 కిలోల బస్తాలు చౌకగా లభిస్తాయి. పన్ను కూడా ఉండదు. పాత బియ్యం, కొత్త బియ్యం ధరల్లో వ్యత్యాసం నిల్వ ఖర్చులు, వడ్డీ, రుచికి చెల్లించే ధర. తెల్ల రేషన్ కార్డు ఉంటే కుటుంబ సభ్యులకు ఉచిత సన్న బియ్యం లభిస్తుంది. జులై నుంచి అక్టోబర్‌కు పెరిగిన రూ.600 పాత నిల్వలు ఉన్న వారికి దక్కింది. కొత్త పంటలో రైతు వాటా పెరిగినా, ధరల నియంత్రణతో వారికి లభించే మొత్తంపై ప్రభావం పడింది. మీరు ఎప్పుడు కొన్నారు అన్నదాన్ని బట్టి, మీ బియ్యం బస్తాలో ఎవరి వాటా ఎంతో మారుతూ ఉంటుంది.
