కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి గంగమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.

భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులకు కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.

మరోవైపు పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఆలయంలో ఘనంగా ‘లక్ష దీపోత్సవం’ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఆదివారం ఒక్కరోజే శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారిని 43,247 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. పవిత్ర సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణం స్వామివారి నామస్మరణతో మార్మోగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *