
కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, వ్రతాలతో పాటు గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. భక్తులు మొత్తం 8.2 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు ఆహారం, మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. మరోవైపు స్వామివారి తెప్పోత్సవం నిర్వహణకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 24వ తేదీ మంగళవారం గిరిప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సుమారు 1.50 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నవరంలోని తొలి పావంచాల వద్ద గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, సుబ్బరాయపురం, సాక్షిగణపతి ఆలయం మీదుగా జాతీయ రహదారికి చేరుకుంటుంది. అనంతరం బెండపూడి సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పోలవరం కాలువ గట్టు మీదుగా పంపా సరోవరం వైపు గిరిప్రదక్షిణ కొనసాగుతుంది.
పంపా రిజర్వాయర్ నుంచి రత్నగిరి, సత్యగిరి ఘాట్ మీదుగా దిగువ ఘాట్‌రోడ్డు చేరుకుని తిరిగి తొలిపావంచాల వద్దకు గిరిప్రదక్షిణ ముగుస్తుంది. మొత్తం 8.2 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రదక్షిణలో 3.9 కిలోమీటర్లు తారురోడ్డు కాగా.. మరో 4.3 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంటుంది.
మరోవైపు మంగళవారం ఉదయం 8 గంటలకు కొండపై నుంచి స్వామివారు, అమ్మవారి ఉత్సవమూర్తులను కిందకు తీసుకొచ్చి తిరుచ్చిపై ఆశీనులను చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8.30 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో కొండ దిగువన ఉన్న తొలిపావంచాల వద్ద సత్యరథం బయలుదేరుతుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య గిరిప్రదక్షిణ ముగిసే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు పంపా హారతులు, రాత్రి 7.30 గంటలకు జ్వాలాతోరణం నిర్వహించనున్నారు.
భక్తుల భద్రత, సౌకర్యాల కోసం పోలీసులు, దేవస్థానం భద్రతా సిబ్బందితో పాటు 50 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు అందించనున్నారు. మార్గమధ్యలో మొత్తం 18 స్టాళ్లను ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు, మజ్జిగ, పండ్లు, ప్రసాదం, బిస్కెట్లు, పాలు పంపిణీ చేయనున్నారు.
భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఐదు వైద్య శిబిరాలు, మూడు విశ్రాంతి వేదికలతో పాటు 21 తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్ర విసర్జన శాలలను ఏర్పాటు చేశారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు రాళ్లు గుచ్చుకోకుండా రహదారిని చదును చేసి, నీటితో తడిపి, దానిపై ఎండుగడ్డి పరచనున్నారు. భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు ఆలయ అధికారులు, సిబ్బందిని ప్రతి కిలోమీటర్‌కు ఒకరి చొప్పున అందుబాటులో ఉంచనున్నారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు కొద్దిసేపు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు.
గిరిప్రదక్షిణ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బెండపూడి నుంచి అన్నవరం వరకు జాతీయ రహదారిపై వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. భక్తుల వాహనాల కోసం కొండపైన, కొండ దిగువన ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.




