
2018లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మద్దతు తెలిపాడు. బాల్ టాంపరింగ్ గురించి ఆస్ట్రేలియా జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించిన ఏబీడీ.. అప్పట్లో జరిగిన పరిణామాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
2018లో ఏం జరిగింది?
2018లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్ టాంపరింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బంతి ఆకారాన్ని మార్చేందుకు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో కలిసి కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్ ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఈ ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకుంది. దీంతో ఈ వివాదం అంతర్జాతీయ క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు..
ఈ వివాదంపై ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. తాను ఎవరినీ వ్యక్తిగతంగా తప్పుబట్టడం లేదని స్పష్టం చేశాడు. ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించడంలో తప్పులేదని పేర్కొన్నాడు. ఈ ఘటనలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఇది వ్యక్తిగత అంశంగా మారిపోయిందని అభిప్రాయపడ్డాడు.
బాల్ టాంపరింగ్ ఒక్కసారి మాత్రమే జరిగిందని భావించలేమని, అంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పాడు. పోర్ట్ ఎలిజబెత్లోనే కాకుండా డర్బన్లోనూ ఇలాంటి చర్యలు జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించాడు. అప్పటి మ్యాచ్ ఫుటేజీని మరోసారి నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
జట్టులో అందరికీ తెలుసు..
ఈ వివాదంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ తనకు ఆశ్చర్యంగా ఉందని ఏబీడీ తెలిపాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లకు శాండ్‌పేపర్ గురించి తెలుసా? అనే ప్రశ్నకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించాడు. అయితే నిబంధనలకు విరుద్ధమైన చర్యకు పాల్పడుతున్నారనే విషయం జట్టులోని అందరికీ తెలిసి ఉండొచ్చనే అంశాన్ని విస్మరిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో శాండ్‌పేపర్ గేట్ వివాదం మరోసారి క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




