
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గతంలో ఎంపీ పదవితో పాటు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయన.. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే తాజాగా ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 11న పార్టీని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తాజాగా పార్టీలో ముగ్గురికి కీలక పదవులు కేటాయించారు. ఈ నియామకాల్లో దివంగత నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యకు కూడా చోటు కల్పించడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి యాక్టివ్ అయ్యారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల తమ పార్టీలో 5 లక్షల మంది సభ్యులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఇదే పేరుతో ఇప్పటికే మరో పార్టీ కొనసాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి పార్టీ రద్దయిందంటూ ప్రచారం జరగడంతో ఆయన స్పందించి స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా పార్టీలో మూడు కీలక పదవులను ప్రకటించారు. ఈ నియామకాల్లో దివంగత నందమూరి తారకరత్న సతీమణి నందమూరి అలేఖ్యకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమె విజయసాయిరెడ్డికి బంధువు కావడం కూడా ఈ నియామకంపై ఆసక్తి పెంచుతోంది.
పరివర్తన రాజనీతి పార్టీ రిజిస్ట్రేషన్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రద్దు చేసిందంటూ టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు, పార్టీలో చేరాలనుకునే వారిని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ చట్టబద్ధంగా రిజిస్టర్ అయిందని, రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఈసీఐ రికార్డుల ప్రకారం పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడిగా తాను, ప్రధాన కార్యదర్శిగా నందమూరి అలేఖ్య, కోశాధికారిగా దక్షిణామూర్తి గుర్తింపు పొందినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఆత్మవిశ్వాసం దెబ్బతినదని పేర్కొన్నారు. పార్టీ నిరంతరం ఎదుగుతూ ప్రజల్లో మరింత బలపడుతుందని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై పరివర్తన రాజనీతి పార్టీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. పార్టీ రిజిస్ట్రేషన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడం రాజకీయ నిస్సహాయతకు నిదర్శనమని విమర్శించింది. విజయసాయిరెడ్డి నాయకత్వంలో రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్య మార్గంలో పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. తమ బలం ప్రజల విశ్వాసమే తప్ప రాజకీయ ప్రచారాలు కాదని పేర్కొంది. ఎలాంటి దుష్ప్రచారాలు పార్టీ ఎదుగుదలను అడ్డుకోలేవని, ప్రజల్లో తమ ఉనికిని మరింత విస్తరించి రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తామని పార్టీ వెల్లడించింది.
యువత ఆలోచనలు, ఆశయాలకు పరివర్తన రాజనీతి పార్టీ (PRP)లో పెద్దపీట వేస్తామని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు కోరుకునే యువతకు తమ పార్టీ సరైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలు, అనుభవం, నాయకత్వ లక్షణాలను ప్రజా రాజకీయాల్లో వినియోగించి సరికొత్త మార్పునకు నాంది పలకాలని ఆహ్వానించారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యత, కొత్త ఆలోచనలకు సముచిత స్థానం కల్పిస్తామని.. ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పం ఉన్న యువతకు PRPలో అవకాశాలు కల్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.




