
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పల్నాడు జిల్లాలో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాసరావుతో పాటు మరో 65 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 66 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. గుంటూరు నుంచి సుమారు 25 కార్లలో వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడికి సిద్ధమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాలకృష్ణ పీఏ పేరు తెరపైకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు మరో 65 మందిని పల్నాడు పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 66 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
పావులూరి శ్రీనివాసరావు స్వగ్రామం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని తిమ్మాపురం. స్థానికంగా ఆయన వర్గానికి చెందిన కొందరు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసేందుకు కార్లతో ర్యాలీగా యడ్లపాడులోని నామినేషన్ కేంద్రానికి బయలుదేరారు. అయితే తిమ్మాపురంలో కొంతకాలంగా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు పేరు కూడా ఉండటంతో వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది
తిమ్మాపురంలో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా అలజడి సృష్టించేందుకు పావులూరి శ్రీనివాసరావు వర్గం ప్రయత్నించిందని నరసరావుపేట ఏఎస్పీ వెల్లడించారు. గుంటూరు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 22 కార్లలో సుమారు 100 మందిని తిమ్మాపురానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వారికి ఓ చోట మద్యం, బిర్యానీ ఏర్పాటు చేసి.. కార్లలో కత్తులు, కర్రలతో గ్రామానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో పావులూరి శ్రీనివాసరావుతో పాటు మరో 65 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి 22 కార్లు, నాలుగు పెద్ద కత్తులు, 60 కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు తమ వారిపై పోలీసులు అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ పావులూరి శ్రీనివాసరావు వర్గీయులు నాదెండ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
తిమ్మాపురం సర్పంచ్ పదవికి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు, టీడీపీ నేత నాగండ్ల రాంబాబుతో పాటు పావులూరి శ్రీనివాసరావు వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో గ్రామంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు సంయమనం పాటిస్తూ రాజీ మార్గంలో ముందుకు వెళ్లాయి. అయితే సర్పంచ్ పదవి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుతో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు కావడం స్థానికంగా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




