తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న కార్తీక పర్వదీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే సహస్ర దీపాలంకరణ సేవను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులను భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది.

మరోవైపు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన అనంతరం దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున నిర్వహించే గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే కార్తీక దీపోత్సవం కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేతి వత్తులతో దీపాలు వెలిగించి, ఛత్రచామరాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విమాన ప్రదక్షిణ చేస్తారు. అనంతరం ఆనంద నిలయంలో కొలువైన శ్రీవారికి దీపహారతి సమర్పిస్తారు.

దీపోత్సవంలో భాగంగా తిరుమల ఆలయంలోని పలు పవిత్ర ప్రదేశాల్లో దీపాలను వెలిగించనున్నారు. గర్భాలయంలోని అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభా అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలు ఏర్పాటు చేయనున్నారు.

తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి వాహన సేవలు, దర్శనాల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు, పంచమి తీర్థం ఏర్పాట్లపై శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దర్శనం, రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత తదితర అంశాల్లో ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.

పంచమి తీర్థం రోజున లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అధికారులకు సూచించారు. భక్తులు వేచి ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు, జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని, ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేలా అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

పుష్కరిణిలోకి భక్తులను విడతల వారీగా అనుమతించాలని, స్నానఘట్టాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను క్రమబద్ధీకరించడంతో పాటు బారికేడ్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి తొక్కిసలాటకు అవకాశం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరు వరకు పడి ఊరేగింపుగా వచ్చే మార్గంలో అవసరమైన రహదారి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఈవో వెల్లడించారు. ఉద్యానవన విభాగం సహకారంతో, జేఈవో పర్యవేక్షణలో ఆలయం లోపల, వెలుపల అందమైన పుష్పాలంకరణలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అమ్మవారి వాహనసేవలను భక్తులందరూ వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. వాహనసేవల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారి వాహనసేవలను తిలకించి, దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈవో కోరారు. భక్తులకు చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *