
ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు కూడా సమాజంలో గౌరవం గుర్తింపు లభించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఐటీఐ కోర్సుల పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపును తొలగించి నైపుణ్యం కలిగిన కార్మికులకు తగిన గౌరవం కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్ ఐఐటీ గ్రాడ్యుయేట్ల మాదిరిగానే ఐటీఐ విద్యార్థులు కూడా సమాన గౌరవానికి అర్హులని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో నైపుణ్యం కలిగిన కార్మిక శక్తికి ఎంతో విలువతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
తాను జర్మనీలోని ఆటోమొబైల్ ఫ్యాక్టరీల్లో ఇంటర్న్షిప్ చేసిన సమయంలో నైపుణ్యం కలిగిన కార్మికులకు అక్కడ ఇచ్చే గౌరవాన్ని ప్రత్యక్షంగా చూశానని లోకేశ్ వెల్లడించారు. కార్మికులకు లభించే గౌరవం గుర్తింపే జర్మనీని ప్రపంచంలోనే అత్యుత్తమ తయారీ కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ఐటీఐ కోర్సుల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించాలని నైపుణ్య ఆధారిత వృత్తులను ఎంచుకోవడంలో యువత గర్వపడేలా ప్రోత్సహించాలని లోకేశ్ సూచించారు. నైపుణ్యం కలిగిన కార్మికులకు సమాజంలో తగిన గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా అంతకుముందు శనివారం ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అంశంపై మాట్లాడారు. పిల్లలు ఐటీఐ కోర్సులు అభ్యసించడాన్ని తల్లిదండ్రులు తక్కువగా భావించే మనస్తత్వాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల నిర్వహణలో నైపుణ్యం కలిగిన కార్మికులు వారి కష్టమే కీలకమని ప్రధాని స్పష్టం చేశారు.




