భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడంపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించాడు. తుది జట్టు ఎంపికలో ప్రధాన స్పిన్నర్‌కు చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. ఐదో రోజు పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారుతుందని, అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఎంతో ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎక్కడ?

తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు పది వికెట్లు పడగొట్టలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పిచ్ నుంచి బౌలర్లకు తగిన సహకారం అందలేదని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వివరించాడు. అయితే జట్టు కూర్పుపై గంగూలీ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

పరిమిత ఓవర్ల సిరీస్‌లలో టీమ్ ఇండియా అద్భుతంగా ఆడిందని, ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ అదే స్థాయిలో రాణించాలంటే సరైన జట్టు ఎంపిక అవసరమని పేర్కొన్నాడు. నాణ్యమైన స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా టెస్టు మ్యాచ్ గెలవడం కష్టమని తెలిపాడు.

వాషింగ్టన్ సుందర్‌ను ఆల్‌రౌండర్‌గా ఆడిస్తున్నప్పుడు.. కుల్దీప్ యాదవ్ లేదా మానవ్ సుతార్ వంటి స్పెషలిస్ట్ స్పిన్నర్లకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించాడు. సమయం గడిచే కొద్దీ పిచ్ ఫ్లాట్‌గా మారుతుందని, అలాంటి సమయంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

పిచ్‌పై మాజీ క్రికెటర్ల అసంతృప్తి

తొలి టెస్టు డ్రాగా ముగియడంతో పిచ్ నాణ్యతపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందిస్తూ.. మ్యాచ్‌లో ఫలితం రాకపోవడం నిరాశ కలిగించిందని, పిచ్ నుంచి ఇలాంటి స్పందన వస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు.

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ కూడా గావస్కర్ అభిప్రాయంతో ఏకీభవించాడు. టెస్టు క్రికెట్‌లో బ్యాట్, బంతి మధ్య సమతూకంతో కూడిన పోటీ ఉండాలని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో అలాంటి పోటీ కనిపించలేదని అభిప్రాయపడ్డాడు. ఐదో రోజు ఉదయం పిచ్ కొంతవరకు బాగానే అనిపించినా.. సమయం గడిచేకొద్దీ బౌలర్లకు సహకారం తగ్గిపోయిందని పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *