
D Spiritual: Nov 23: అనకాపల్లి: నూకాలమ్మ ఆలయంలో ఘనంగా రుద్ర హోమం.. పాల్గొన్న పెద్ద సంఖ్యలో భక్తులు!
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని ప్రసిద్ధ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ రుద్ర హోమాన్ని ఘనంగా చేపట్టారు.
దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ లక్ష్మీ నగేష్ ఆధ్వర్యంలో రుద్ర హోమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదమంత్రాల నడుమ పండితులు హోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం ఆలయంలోని శివలింగానికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టారు. లోక కల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో రుద్ర హోమం, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో నూకాలమ్మ ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.



