
D Spiritual: Nov 23: పరకాలలో అయ్యప్ప ఆలయంలో ఏకశిల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన.. ఘనంగా ప్రత్యేక పూజలు!
పరకాల పట్టణంలోని హరిహరసుత శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం ఏకశిల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు.
ఈ సందర్భంగా ఏకశిల ధ్వజస్తంభ దాత తోట రమాదేవి రవీందర్, ప్రతిష్ఠ దాత శ్యామల అరుణ రాజు, నవగ్రహాల దాత గందె ఉదయలక్ష్మి సత్యానందం, ప్రతిష్ఠ దాత చౌళ్ళ కవిత లక్ష్మణరావు, నాగేంద్ర దాత వంగాల అనసూయ సారంగపాణి సహకారంతో ధ్వజస్తంభ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు.
ప్రముఖ పండితులు ఆచార్య కోమలపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమ కార్యక్రమంతో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఏకశిల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు, ప్రత్యేక అర్చనలు చేపట్టారు.
ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులకు అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు, దాతలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.



