విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ లక్ష్మీ శా ఎన్నికల అధికారి హోదాలో ఆయనతో ప్రమాణం చేయించారు.
విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో రాధాకృష్ణతో ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ లక్ష్మీ శా ప్రమాణం చేయించారు. మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం అనంతరం కలెక్టర్ లక్ష్మీ శా.. నగర కార్పొరేటర్లతో వరుసగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంతో విజయవాడ నగర పాలక సంస్థలో నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది.

ఏపీలో పలుచోట్ల మేయర్లు, ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం
ఏపీలో పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. డోన్ మున్సిపల్ ఛైర్మన్‌గా కోట్ల సుజాతమ్మ, ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, కర్నూలు మేయర్‌గా బొల్లెద్దుల విజయ ప్రత్యూష, తిరువూరు ఛైర్‌పర్సన్‌గా పసుపులేటి మాధవి బాధ్యతలు స్వీకరించారు.
- ఏలూరు: ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. నేటి నుంచి నూతన కౌన్సిల్ పదవీకాలం ప్రారంభంకానుంది.
- కర్నూలు: నగర పాలక సంస్థ మేయర్, వార్డు సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారంతో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం జరిగింది. కర్నూలు నగర మేయర్‌గా ఎన్నికైన బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో కలెక్టర్ సిరి ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వార్డు సభ్యులచే జిల్లా కలెక్టర్ ప్రమాణం చేయించారు. నూతన మేయర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూషకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ శుభాకాంక్షలు తెలిపారు.
- కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మచిలీపట్నం నగర పాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పాలకవర్గ సభ్యులచే ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ప్రమాణం చేయించారు. తొలుత మేయర్‌గా షేక్ అబ్దుల్ అబీదా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేసి మేయర్ అబీదా అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తెలుగు అక్షర క్రమంలో 60 మంది కార్పొరేటర్లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కూటమి శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎఈడీ స్క్రీన్స్ ద్వారా ప్రమాణ స్వీకారోత్సవాన్ని అధికారులు లైవ్ టెలికాస్ట్ చేశారు.
- గుంటూరు జిల్లా: గుంటూరు నగర నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు 76 మంది కార్పొరేటర్ల చేత జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రమాణం చేయించారు. నూతనంగా ఎన్నికైన మేయర్, 76 మంది కార్పొరేటర్లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పాలకవర్గంతో కలిసి పనిచేయడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. అందరం సమన్వయంతో పనిచేసి గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేద్దామన్న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ఇక గుంటూరు నగర డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పోరేటర్ యర్రంశెట్టి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. రాజేష్ కూటమి కార్పొరేటర్లు మద్దతు తెలిపారు.
- చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్ కొత్త పాలకమండలి ఏర్పాటు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 4వ మేయర్‌గాకటారి హేమలత ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా ఆర్.గోపీనాథ్‌ను కార్పొరేటర్లు ఎన్నుకొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌లచేత జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జడ్పి ఛైర్‌పర్సన్ శైలజ తేజో మూర్తి హాజరయ్యారు.
- విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ 119 మంది కార్పొరేటర్లు స్పెషల్ ఆఫీసర్ చేతులమీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యుటీ మేయర్‌గా పందిరి వెంకట శివప్రసాద్ పేరును ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు ప్రపోజ్ చేయగా.. ఎంపి శ్రీ భరత్ బలపరిచారు. ఒకే ఒక నామినేషన్ రావడంతో శివప్రసాద్ డిప్యుటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పెషల్ ఆఫీసర్ అభిషిక్త కిషోర్ ప్రకటించారు.
- నెల్లూరు: నెల్లూరు నగర కార్పొరేషన్ రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌తో పాటు కార్పోరేటర్లకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రమాణ స్వీకారం చేయించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హాజరయ్యారు.
మున్సిపల్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం
- నంద్యాల: డోన్ నూతన మున్సిపల్ ఛైర్మన్‌గా కోట్ల సుజాతమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 36 వార్డులకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
- ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పురపాలక సంఘం నూతన ఛైర్‌పర్సన్‌గా పసుపులేటి మాధవి (జనసేన పార్టీ ) పదవి ప్రమాణ స్వీకారం చేశారు. మాధవి చేత రిటర్నింగ్ అధికారి ఆర్థివో ఏ. కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా నరేంద్రుల వినీత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమంలో మిగిలిన కౌన్సిలర్లు ప్రమాణం చేశారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కన్నెగంటి అమూల్య ప్రమాణం చేశారు.
- తూ.గో.జిల్లా: కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్‌గా కంఠశని విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 28 వార్డుల కౌన్సిలర్లు ప్రమాణం చేశారు.
- పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి మారెళ్ల రామాంజనేయులు ప్రమాణస్వీకారం చేశారు.
- ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఛైర్మన్‌గా కాకాణి అశోక్, వైస్ ఛైర్మన్‌గా రంగిశెట్టి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. దర్శి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం జరిగింది. ఛైర్మన్‌గా దారం సుబ్బారావు(జనసేన), వైస్ ఛైర్మన్ నక్కా చంద్ర బాధ్యతలు స్వీకరించారు. అలాగే చీమకుర్తి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా శిద్దా సుధాకర్, వైస్ ఛైర్మన్‌గా యడ్లపల్లి రామబ్రహ్మం బాధ్యతలు చేపట్టారు.
- మార్కాపురం: కనిగిరి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. ఛైర్మన్‌గా అచ్చాల తిరుపతమ్మ, వైస్ ఛైర్మన్‌గా ఫిరోజ్ బాధ్యతలు స్వీకరించారు. గిద్దలూరు మున్సిపాలిటీ ఛైర్మన్‌గా డాక్టర్ జేవీ నారాయణ (బీజేపీ), వైస్ ఛైర్మన్‌గా శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు.
- బాపట్ల: చీరాల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా హనీ స్పందన, వైస్ ఛైర్మన్‌గా రమేష్ బాధ్యతలు స్వీకరించారు.



